10, జులై 2019, బుధవారం

డిగ్రీతో డిఫెన్స్‌ ఉద్యోగాలు

సీడీఎస్‌ఈ ప్రకటన విడుదల
రక్షణ రంగంలో చక్కటి భవిష్యత్తును ఆశించే పట్టభద్రులకు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) ఎదురుచూస్తోంది. ఇందులో విజయం సాధించినవారు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నతోద్యోగ విధుల్లో చేరిపోవచ్చు. తక్కువ వ్యవధిలోనే అత్యున్నత హోదాలు సొంతం చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో ఈ నియామకాలు చేపడతారు. యూపీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
సీడీఎస్‌ఈ ద్వారా మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. (ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు కూడా అర్హులే. అయితే వీరు ఓటీఏ విభాగంలో వారికోసం ప్రత్యేకంగా కేటాయించిన పోస్టులకు మాత్రమే అర్హులు)
వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీ ఖాళీలకు జులై 2, 1996 కంటే ముందు, జులై 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1996 కంటే ముందు, జులై 1, 2000 తర్వాత జన్మించినవారు అనర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉంటే గరిష్ఠ వయః పరిమితిలో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1995 కంటే ముందు, జులై 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఎలా సిద్ధం కావాలి?
8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదువుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్‌కు సంబంధించి... జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్‌టీ 8-12 తరగతుల పుస్తకాలు ఉపయోగపడతాయి. జీకే లూసెంట్‌ లేదా అరిహంత్‌ వీటిలో ఏదో ఒకటి చదువుకుంటే సరిపోతుంది. సైన్స్‌ విభాగంలోని ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. ఇంగ్లిష్‌ విభాగం ప్రశ్నలన్నీ హైస్కూల్‌ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8,9,10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి.
పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. ఇవన్నీ యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన ఏర్పడుతుంది. పరీక్షకు ముందు నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. పరీక్షలో ఎయిర్‌ ఫోర్స్‌ విభాగానికి 140+, ఆర్మీ 120+, నేవీ 100+, ఓటీఏ 80+ మార్కులు సాధించినవారు తర్వాతి దశకు చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కనీసం 6 నెలలు శ్రద్ధగా చదివితే సీడీఎస్‌ఈ పరీక్షలో అర్హత సాధించవచ్చు. ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్నే లక్ష్యంగా చేసుకున్నవారికి ఏదో ఒక ప్రయత్నంలో తప్పక విజయం వరిస్తుంది.
ఇంటర్వ్యూ: పరీక్షతో సమాన ప్రాధాన్యం ఇంటర్వ్యూకు కల్పించారు. ఈ విభాగానికీ 300 మార్కులు కేటాయించారు. ఇందులో రెండు దశలుంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో దశలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. మొత్తం అయిదు రోజులపాటు ఇవి కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
పరీక్ష ఎలా ఉంటుంది?
సీడీఎస్‌ఈలో భాగంగా ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ అంశాల్లో ప్రతిభను పరిశీలిస్తారు. ఒక్కో పేపర్‌ వంద మార్కులకు చొప్పున మొత్తం 300 మార్కులకు ఉంటుందీ పరీక్ష. ప్రతి ప్రశ్నపత్రాన్నీ రెండు గంటల్లో పూర్తిచేయాలి. మ్యాథ్స్‌ వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు మార్కులో మూడో వంతు చొప్పున తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం తప్ప ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్‌మెటిక్‌, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ లోని అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఇంగ్లిష్‌: ఈ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఉంటాయి. కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌ నాలెడ్జ్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు రోజువారీ పరిశీలనల ద్వారా సమాధానాలు గుర్తించవచ్చు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్‌, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలు సంధిస్తారు. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి.
మొత్తం ఖాళీలు: 417 (ఐఎంఏ-100, ఐఎన్‌ఏ-45, ఏఎఫ్‌ఏ-32, ఓటీఏ-240) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:  జులై 8 సాయంత్రం 6 వరకు
పరీక్ష తేదీ: సెప్టెంబరు 8
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం
https://upsc.gov.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి