10, జులై 2019, బుధవారం

గ్రీన్‌ కోర్సులు.. క్లీన్‌ కొలువులు!

కెరియర్‌ గైడెన్స్‌
ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
పీల్చేగాలీ, తాగే నీరూ, తినే ఆహారం... అన్నీ కలుషితమవుతున్నాయి. పారిశ్రామికీకరణతో పర్యావరణపు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. అయితే ప్రగతిని అడ్డుకుంటే మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుంది. అభివృద్ధికి ఆటంకం లేకుండా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇందుకోసం నిపుణులు అవసరం. వారే ఎన్విరాన్‌మెంటలిస్టులు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా  పర్యావరణానికి ప్రాముఖ్యం పెరిగిన నేపథ్యంలో ఎన్విరాన్‌మెంటల్‌ కోర్సులు చదివినవారికి ఎన్నో ఉద్యోగాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త అవకాశాలు రానున్నాయి.
వాతావరణ మార్పులకు ప్రధాన కారణం పర్యావరణానికి హాని కలగడమే. దీపావళి వచ్చిందంటే చాలు, గాలిలో కాలుష్య శాతం అమాంతంగా పెరిగిపోతుంది. సిమెంట్‌ పరిశ్రమలు, నిర్మాణాలు, ఫార్మా కంపెనీలు, కార్యాలయాలు, ఆఖరికి గృహాలు సైతం పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడం, నాణ్యతా ప్రమాణ నిబంధనలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడం, శుద్ధిచేసే కొత్త పరికరాలను రూపొందించడం..తదితర చర్యల ద్వారా కాలుష్యస్థాయిని నియంత్రించవచ్చు. ఆ ప్రయత్నాన్ని చేసే నిపుణులే ఎన్విరాన్‌మెంటలిస్టులు. ఈ విభాగంలో ఉద్యోగాలు ఆశించేవారు అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి నుంచి ప్రత్యేకంగా పర్యావరణ విద్యను చదువుకోవచ్చు. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌తోపాటు ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ లా, ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్ట్‌, అర్బన్‌ ప్లానింగ్‌.. తదితర కోర్సులు పర్యావరణానికి రక్షణగా నిలుస్తున్నాయి. వివిధ సంస్థలు వీటిని అందిస్తున్నాయి.
వివిధ విభాగాల్లో...
ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌
మ్లవర్షాలు, వాతావరణ మార్పులు, కాలుష్యం, ఓజోన్‌ పొర క్షీణత...ఈ పరిణామాలన్నింటినీ పర్యావరణ ఇంజినీర్లు విశ్లేషిస్తారు. వీటి వెనుక ఉన్న కారణాలు అధ్యయనం చేసి పరిష్కారాలను మన ముందుంచుతారు. ఇవే కాకుండా పర్యావరణ సమస్య ఏది వచ్చినా దాన్ని పరిశీలించి ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఆ తీవ్రత తగ్గించడానికి ఉన్న ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తారు.
ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ కావాలనుకున్నవారు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి. అనంతరం ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల ద్వారా బీఈ /  బీటెక్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరవచ్చు. జాతీయస్థాయిలో పలు సంస్థలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇందులో చేరినవారు బయాలజీ, కెమిస్ట్రీ, సాయిల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ సూత్రాలు, అనువర్తనాలు చదువుకుంటారు. వీరు పర్యావరణానికి ఉపయోగపడే పరికరాలు సైతం తయారుచేస్తారు. ఉదాహరణకు కలుషిత లేదా మురికి నీటి నుంచి మంచినీటిని వేరుచేసే యంత్రాలు రూపొందించి పర్యావరణానికి సహాయపడడం లాంటివన్నమాట. ఎన్విరాన్‌మెంటల్‌ ఆడిటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ మొదలైన ఉద్యోగాలు పబ్లిక్‌, ప్రైవేటు రంగాల్లో ఉన్నాయి. ప్రాసెస్‌ డిజైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్స్‌ హ్యాండ్లింగ్‌, ఆపరేషన్స్‌ మెయింటెనెన్స్‌ ...ఇవన్నీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి ముఖ్యమైన దశలు.
కోర్సులందించే ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ - బాంబే, మద్రాస్‌, రూర్కీ, ఖరగ్‌పూర్‌, కాన్పూర్‌, ధన్‌బాద్‌, ఐఎస్‌ఎం, వారణాసి (బీహెచ్‌యూ), నిట్‌ - సూరత్‌కల్‌, తిరుచురాపల్లి, నాగ్‌పూర్‌, వరంగల్‌, అలహాబాద్‌, దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ.
హైడ్రాలజిస్ట్‌
నీటికొరత, నీటి కాలుష్యం, నీటి సరఫరా విభాగాలకు ఎదురవుతోన్న సమస్యలపై వీరు అధ్యయనం చేస్తారు. పర్యావరణాన్ని కాపాడి నీటి పరిమాణం, నాణ్యత రెండూ పెరిగేలా చూడడం వీరి ముఖ్య బాధ్యత. నీటి కొరతను అధిగమించడానికి వీరు పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు సూచిస్తారు. ఆంధ్రా యూనివర్సిటీతోపాటు పలు సంస్థలు ఎమ్మెస్సీ హైడ్రాలజీ కోర్సు అందిస్తున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌
ర్యావరణ సమస్యలపై వీరు అధ్యయనం చేస్తారు. అందుకు కారణాలు విశ్లేషించి, ఫలవంతమైన పరిష్కారాలు చూపుతారు. జీవ, భౌతికశాస్త్రాల్లోని పరిజ్ఞానం ఇందుకు దోహదపడుతుంది. వీరు అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కారణమవుతున్న సంస్థలు, పరిస్థితులను గుర్తిస్తారు. కాలుష్య కారణాలు, కారకులను తెలుసుకోవడానికి క్షేత్ర పర్యటనలు చేస్తారు. శాంపిల్స్‌ సేకరించి ప్రయోగశాలలో పరిశీలిస్తారు. మానవ చర్యల కారణంగా జరుగుతోన్న నష్టాన్ని గుర్తించి, అందుకు పరిష్కారాలు చూపుతారు. ఎన్విరాన్‌మెంటల్‌ అఫైర్స్‌, నేచర్‌ కన్జర్వేషన్‌, జాతీయ పార్కులు, పర్యావరణ సంబంధిత జాతీయ సంస్థలు... తదితర చోట్ల వీరు సేవలు అందిస్తారు. ఫీల్డ్‌ అనలిస్ట్‌, లేబొరేటరీ టెక్నీషియన్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ మొదలైన ఉద్యోగాలతో కెరియర్‌ ప్రారంభించవచ్చు. ఈ స్థాయి తర్వాత ఉన్నతోద్యోగాలు ఇందులో లభిస్తాయి.
కోర్సులందించే ప్రఖ్యాత సంస్థలు: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ. దాదాపు అన్ని యూనివర్సిటీలూ ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సు అందిస్తున్నాయి. ఈ విభాగంలో శాస్త్రవేత్త కావాలంటే పీహెచ్‌డీ చేయాలి.
ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్‌, అర్బన్‌ ప్లానర్‌
ప్రజా పార్కులు, వ్యక్తిగత సముదాయాలు అన్నిచోట్లా పచ్చదనం కళకళలాడేలా వీరు చూస్తారు. ఖాళీ స్థలాన్ని కళాత్మకంగా పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులు చూపరులకు కనువిందుగా, పర్యావరణానికి హితంగా ఉంటున్నాయి. మంచి ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్చర్‌ కావాలంటే ఈ విభాగంలో డిగ్రీ అనంతరం కొన్నేళ్ల  శిక్షణ తప్పనిసరి. వీరు షాపింగ్‌ మాల్స్‌, కార్యాలయాలు, పాఠశాలలు, నివాస సముదాయాలు...మొదలైనవన్నీ పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇందుకోసమే ఆయా సంస్థలు కొంత స్థలం సైతం వెచ్చిస్తాయి. దీంతో అందానికి అందంతోపాటు పర్యావరణానికి మేలూ జరుగుతుంది.
ల్యాండ్‌స్కేప్‌ డిజైన్‌లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీలను పలు సంస్థలు అందిస్తున్నాయి. అలాగే అర్బన్‌ ప్లానింగ్‌లో సైతం యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. వీరికి స్థానిక సంస్థలు, పబ్లిక్‌, ప్రైవేటు విభాగాలు, స్థిరాస్తి, నిర్మాణ సంస్థల్లో ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు కోర్సులు అందిస్తున్నాయి.
వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌
న్యమృగాల సంరక్షణను ఇష్టపడేవారు వైల్డ్‌లైఫ్‌ బయాలజీ కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు వన్యజీవులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తారు. ఆ జీవజాతుల ఉనికికి ఎదురవుతోన్న ముప్పు పసిగట్టి, రక్షణ చర్యలను సూచిస్తారు. వాటి సంఖ్య పెరిగేలా చూస్తారు. అరుదైన, అంతరించిపోతున్నవాటిపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వైల్డ్‌లైఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దేహ్రాదూన్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయలాజికల్‌ సైన్సెస్‌ బెంగళూరు...తదితర సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
సస్టెయినబిలిటీ మేనేజ్‌మెంట్‌
రోగ్యకరమైన, పర్యావరణహితమైన సంస్థలను రూపొందించడం సస్ట్టెయినబిలిటీ మేనేజర్ల ప్రధాన విధి. ప్రతి కంపెనీలోనూ వీరు సేవలు అందిస్తారు. చేపట్టబోయే నిర్మాణం, కార్యక్రమం కారణంగా పర్యావరణానికి ఏదైనా అపాయం ఉందని భావిస్తే సంస్థ దృష్టికి తీసుకెళ్తారు. ప్రత్యామ్నాయ మార్గాలను వివరిస్తారు. వృథాను సైతం అరికడతారు. కార్యాలయాల్లో తక్కువ శక్తి ఉపయోగించుకుని ఎక్కువ వెలుగులు అందించే బల్బులు పెట్టడం, రీసైక్లింగ్‌ ప్లాంట్‌, ఎక్కువ కాలం శాశ్వతంగా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు. ఐఐఎంలు సహా పలు సంస్థలు ఎంబీఏ సస్ట్టెయినబిలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందిస్తున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ మేనేజ్‌మెంట్‌
చాలా ఆరోగ్య సమస్యలకు మూలకారణం పర్యావరణ కాలుష్యం. ఈ కారణంగానే ఎక్కువమంది మనుషులతోపాటు మూగ జీవాలూ మరణిస్తున్నాయి. ఉత్పత్తి సైతం గణనీయంగా పడిపోతుంది. ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి పొల్యూషన్‌ మేనేజర్లు అవసరం. వీరు కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పూర్తిగా లేకుండా చూడడం, రీ సైక్లింగ్‌... మొదలైనవి చేస్తారు.  ఇందుకోసం ఎంబీఏ పొల్యూషన్‌ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎమ్మెస్సీ పొల్యూషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ కంట్రోల్‌ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి.
ఎన్విరాన్‌మెంటల్‌ లాయర్‌
ర్యావరణ సమస్యలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడం ఎన్విరాన్‌మెంటల్‌ లాయర్ల ముఖ్య విధి. వివిధ పరిశ్రమలు, కార్యాలయాలు, సంస్థల్లో వీరు సేవలు అందిస్తారు. పర్యావరణ సంబంధిత కేసులను పరిష్కరిస్తారు.  నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పరిధిలోకి వచ్చే కేసులను వాదిస్తారు. ఈ విభాగంలో సేవలు అందించడానికి ఎల్‌ఎల్‌బీ అనంతరం ఎల్‌ఎల్‌ఎంలో ఎన్విరాన్‌మెంటల్‌ లా కోర్సు చదవాల్సి ఉంటుంది.
అవకాశాలు ఎక్కడ?
ర్యావరణ కోర్సులు చదువుకున్నవారికి కాలుష్య నియంత్రణ మండలి, ఎన్జీవోలు, పర్యావరణ శాఖలు, గ్రీన్‌ బిజినెస్‌ సంస్థలు, కర్మాగారాలు, నిర్మాణ సంస్థలు, తయారీ కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. డిస్టిలరీలు, ఫెర్టిలైజర్‌ ప్లాంట్లు, మైన్స్‌, రిఫైనరీలు, టెక్స్‌టైల్‌ మిల్స్‌, అర్బన్‌ ప్లానింగ్‌, వాటర్‌ రిసోర్సెస్‌ అండ్‌ అగ్రికల్చర్‌, కాలేజీలు, యూనివర్సిటీలు, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేటు కంపెనీలు ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజర్‌, ప్రొజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుల్లో వీరికి అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు పీజీలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదివినవారిని ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నాయి. ఎన్విరాన్‌మెంటల్‌ ఫొటోగ్రాఫర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ జర్నలిస్టు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ తదితర హోదాలతోనూ ఉద్యోగాలు ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి